2024 మార్చి నాటికి స్టీల్ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేయనున్న వేదాంత!

అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ తన ఉక్కు ఆస్తుల విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయనుంది.

Update: 2023-10-03 13:34 GMT

న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ తన ఉక్కు ఆస్తుల విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయనుంది. ఈ మేరకు అనిల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2018లో రూ. 5,230 కోట్లకు ఈఎస్ఎల్ స్టీల్‌ను కొనుగోలు చేసిన తర్వాత వేదాంత తన స్టీల్, స్టీల్ ముడిసరుకు వ్యాపారాన్ని విడదీసింది. తాజాగా ఈ జూన్‌లో ఆయా వ్యాపారాలపై సమీక్షను చేపట్టింది. ప్రధాన మైనింగ్ వ్యాపారంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ తన స్టీల్ ఆస్తులను విక్రయానికి సిద్ధమైంది. గతవారం వేదాంత తన ఆరు వ్యాపారాల డీమెర్జ్ ద్వారా సంస్థ పునర్నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అల్యూమినియం, ఆయిల్-గ్యాస్‌, ఉక్కు, ఉక్కు- ఫెర్రస్‌ మెటీరియల్స్‌, బేసిక్ మెటల్ వ్యాపారాలను విడదీసి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియ వచ్చే 12-15 నెలల్లో పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది. ఇదే సమయంలో వేదాంత పునర్నిర్మాణంపై రేటింగ్ సంస్థలు ప్రతికూలంగా స్పందించాయి. వ్యాపారాల విభజన మెరుగైన నిర్ణయమే అయినప్పటికీ అప్పుల గురించి సంస్థ ప్రస్తావించలేదని అభిప్రాయపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో వేదాంత షేర్లు మంగళవారం 3.7 శాతం పెరిగి రూ. 230.9 వద్ద ముగిశాయి.


Similar News