UPI Transactions: డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు..!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) లావాదేవీలు గత నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) లావాదేవీలు గత నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. డిసెంబర్(December)లో మొత్తం రూ. 1673 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని, వాటి విలువ రూ. 23.25 లక్షల కోట్లుగా ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇంత మొత్తంలో ఎప్పుడు లావాదేవీలు జరగలేవని, యూపీఐ సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది డిసెంబర్లో జరిగిన లావాదేవీలే అత్యధికమని పేర్కొంది. నవంబర్(November)లో రూ.21.55 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సక్షన్స్ జరిగినట్లు NPCI వెల్లడించింది. నవంబర్ లో రోజూ రూ.71,840 కోట్ల యూపీఐ చెల్లింపులు జరగగా.. డిసెంబర్ నెలలో రోజువారీ పేమెంట్స్ రూ.74,990 కోట్లకు పెరిగింది. అలాగే ఫాస్టాగ్(Fastag) లావాదేవీల విలువ రూ. 38 కోట్లుగా నమోదైందని, బ్యాంకుల ద్వారా జరిగే ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్(IMPS) లావాదేవీల సంఖ్య రూ. 44 కోట్లకు పెరిగినట్లు NPCI తెలిపింది.