తగ్గిన యూపీఐ లావాదేవీలు
మార్చి నెలతో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 1 శాతం, విలువ పరంగా 0.7 శాతం తగ్గాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న యూపీఐ లావాదేవీ ఈ ఏడాది ఎప్రిల్‌లో నెల ప్రాతిపదికన స్వల్పంగా తగ్గాయి. మార్చి నెలతో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 1 శాతం, విలువ పరంగా 0.7 శాతం తగ్గాయి. సమీక్షించిన నెలలో మొత్తం రూ. 19.64 లక్షల కోట్ల విలువ లావాదేవీలు నమోదవగా, అంతకుముందు నెలలో 19.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంఖ్యా పరంగా 1,330 కోట్ల లావాదేవీలు జరిగాయి. మార్చిలో 1,344 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అయితే, వార్షిక ప్రాతిపదికన యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం వృద్ధి సాధిస్తుండటం, యూపీఐ నిర్వహణలో ఉన్న సౌకర్యం ఇందుకు కారణం. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌లో యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించి మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో విలువ పరంగా 7 శాతం, సంఖ్యా పరంగా 5 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సంఖ్యలో 11 శాతం, విలువలో 14 శాతం వృద్ధి నమోదైంది. ఫాస్టాగ్ చెల్లింపులు సంఖ్యలో 3 శాతం, విలువలో 6 శాతం తగ్గాయి.