Banks Disinvestment: బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సరైన సమయం
ఎక్కువ మూలధనం కారణంగా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగ పరిస్థితి అత్యంత ఆరోగ్యంగా ఉంది
దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం అని టాప్ బ్యాంకర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంకింగ్ నిపుణులు మాట్లాడుతూ.. తక్కువ నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ), ఎక్కువ మూలధనం కారణంగా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగ పరిస్థితి అత్యంత ఆరోగ్యంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం నిధులు సమకూరవచ్చని చెప్పారు. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వం 90 శాతం కంటే ఎక్కువ వాటాను కొనసాగిస్తోంది. కాబట్టి ఇది పెట్టుబడుల వాటాను తగ్గించేందుకు అనుకూలమని యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనీ కుమార్ అన్నారు. గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన నిష్పత్తి 15.53 శాతం వద్ద ఉండగా, బ్యాంకుల నికర ఎన్‌పీఏ నిష్పత్తి అనేక సంవత్సరాల కనిష్టం 0.6 శాతానికి పడిపోయింది. ఇలాంటి సానుకూల సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ చెడ్డ ఆలోచన కాదని ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు.