నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8% లేదా అంతకంటే ఎక్కువే: ఆర్థిక మంత్రి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు

Update: 2024-03-30 14:05 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మెరుగైన ద్రవ్యోల్బణం నిర్వహణ, స్థూల ఆర్థిక స్థిరత్వం వల్ల 2023/24 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఏ విధమైన వృద్ధిని కనబరిచిందో, ఇప్పుడు కూడా అదే వృద్ధి రేటును చూపిస్తుందని తెలిపారు. భారత్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి చెందింది. ఇది అంతకుముందు 7.6 శాతంగా నమోదైంది. జనవరి-మార్చి కాలానికి సంబంధించిన జీడీపీ డేటా మే 31 న విడుదల అవుతుంది.

ప్రభుత్వ ముందస్తు అంచనాల ప్రకారం, మార్చి 31, నాటికి భారత జీడీపీ 7.6 శాతం వద్ద వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. అయితే చివరి వరకు ఈ సంఖ్యలో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఆర్థికమంత్రి మాట్లాడుతూ, ఇంధనం, సోలార్, జియోనామిక్స్, AI, గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్, సెమీకండక్టర్స్‌లో ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున ముందుకు దూసుకుపోతుందని అన్నారు. చమురు ధరలు పెరిగినట్లయితే ప్రజలపై భారం పడకుండా నిర్వహణ చేయాల్సి ఉందని ఈ సందర్బంగా తెలిపారు.


Similar News