సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఈవీ పాలసీ

భారత్‌ను ఎలక్ట్రానిక్ వాహనాలకు హబ్‌గా మార్చడానికి కేంద్రం గతంలో ప్రకటించిన ఈవీ పాలసీ ఏప్రిల్ 1(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది.

Update: 2024-03-31 12:37 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ను ఎలక్ట్రానిక్ వాహనాలకు హబ్‌గా మార్చడానికి కేంద్రం గతంలో ప్రకటించిన ఈవీ పాలసీ ఏప్రిల్ 1(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. దేశంలో ఈవీ స్వీకరణను మరింత వేగవంతం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ. 500 కోట్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ( EMPS 2024 ) పథకాన్ని గతంలో ప్రకటించింది. తాజాగా ఇది సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ పాలసీ కింద ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన వారికి రాయితీలు లభిస్తాయి. ఇది నాలుగు నెలల పాటు అమల్లో ఉంటుంది. సోమవారం నుంచి జులై చివరి వరకు ఈ పాలసీ కొనసాగుతుంది.

గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీసుకొచ్చిన FAME-II పథకం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరో ఈవీ పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ద్వారా రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి నాలుగు నెలల కాలంలో 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా రూ.10 వేల వరకు సబ్సిడీ, 31 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్‌పై రూ.25 వేల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ఆటోలకు రూ.50 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా, EMPS 2024 దేశంలో సమర్థవంతమైన, స్థితిస్థాపకమైన ఈవీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది, సరఫరా గొలుసును బలోపేతం చేయడం, గణనీయమైన ఉపాధి అవకాశాలను అందించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


Similar News