Tesla : రూ. 20 లక్షలకే టెస్లా EV కారు!
ఎలన్ మస్క్ నేతృత్వంలోని గ్లోబల్ ఈవీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తయారీతో పాటు ఎగుమతులపై కూడా దృష్టి సారించాలని భావిస్తోంది.
న్యూఢిల్లీ: ఎలన్ మస్క్ నేతృత్వంలోని గ్లోబల్ ఈవీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తయారీతో పాటు ఎగుమతులపై కూడా దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ మేరకు టెస్లా ప్రతినిధులు ఈ నెలలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశీయంగానే తయారీని చేపట్టడం ద్వారా రూ. 20 లక్షలకే టెస్లా కారును ఉత్పత్తి చేసేందుకు ఫ్యాక్టరీని నిర్మించే ప్రణాళికపై మంత్రితో చర్చించనున్నారు.
దేశీయంగా స్థానిక తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కంపెనీ ఆసక్తిగా ఉంది. పూర్తిస్థాయి చర్చలు ముగిసిన తర్వాత సరసమైన ఈవీల కోసం భారత మార్కెట్లో డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ఎగుమతులకు కేంద్రంగా తయారీ ప్లాంట్ ఏర్పాటు ఉండాలని కంపెనీ లక్ష్యంగా ఉంది. దేశీయంగా రాబోయే టెస్లా తయారీ ఫ్యాక్టరీ గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ముఖ్యంగా దేశీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూ. 20 లక్షల ధరలో కారును విడుదల చేయనున్నారు. ఇది చైనాలో ప్రారంభ సెడాన్ కారు మోడల్-3 రూ. 26.32 లక్షల కంటే 25 శాతం తక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ప్రారంభ దశలోనే ఉంది.
దేశంలోని మొత్తం వాహన అమ్మకాల్లో ఈవీల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే, టెస్లా బడ్జెట్ సెగ్మెంట్‌లోకి రావడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఈవీలకు డిమాండ్ ఊపందుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read More: ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా?