ఇప్పటివరకు టెక్ కంపెనీల్లో రోజుకు 2,700 మంది ఉద్యోగుల తొలగింపు!
గత కొన్నిరోజులుగా టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వడ్డీ రేట్ల పెంపు, ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగ రేటు, అమెరికా-రష్యా మధ్య ముదురుతున్న వివాదం, ఇంకా అనేక కారణాలతో ప్రధాన ఆర్థికవ్యవస్థలన్నీ మాంద్యం ఎదుర్కొంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. దాంతో పాటు కరోనా సమయంలో ఎడాపెడా ఉద్యోగులను నియమించుకున్న తర్వాత ఖర్చుల నియంత్రణ కోసం కంపెనీలు లేఆఫ్స్‌ను ప్రకటిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు మొదలుకొని యూనికార్న్, స్టార్టప్‌ల వరకు అందరిదీ ఇదే బాట. గతేడాది ద్వితీయార్థం నుంచి మొదలైన ఈ ధోరణి 2023 ప్రారంభంలో మరింత ముదిరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ప్రతి రోజు 2,700 మందికి పైగా ఉద్యోగులు ఇంటికి పంపబడ్డారు.
పలు గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 1.53 లక్షల మంది ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. తొలగింపుల జాబితాలో లేని ఉద్యోగులు కూడా వేతన తగ్గింపు, పెరుగుదల లేకుండా పని చేస్తున్నారు. దీనికితోడు కొత్తగా నియమించబడిన వారు ఆన్‌బోర్డింగ్ ఆలస్యం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలే 51 వేల మందిని తీసేశాయి. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నారని టెక్ లేఆఫ్స్ డేతాను పరిశీలించే ట్రూఅప్ డాట్ ఐఓ తెలిపింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2023లో మరిన్ని ఉద్యోగులను తొలగించడం వీలుకాకపోతే ఉన్నవారి జీతాలను సగానికి తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్టు నివేదికలు అంచనా వేస్తున్నాయి.