మార్చి త్రైమాసికంలో 15 శాతం పెరిగిన TCS లాభాలు!
ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆదాయ వివరాలను బుధవారం వెల్లడించింది.
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆదాయ వివరాలను బుధవారం వెల్లడించింది. 2022-23 చివరి త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూ. 11,392 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 9,959 కోట్లతో పోలిస్తే ఇది 14.8 శాతం పెరిగింది. ఇక, ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 16.9 శాతం వృద్ధితో రూ. 59,.162 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం రూ. 50,591 కోట్లుగా నమోదైంది.
ఇక, ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో 2022-23కి గానూ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 24 డివిడెండ్‌ను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు అమోదం తెలిపినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అదేవిధంగా జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 821 మందిని నియమించినట్టు పేర్కొంది. దాంతో కంపెనీలో మొత్తం 6,14,795 మంది ఉద్యోగులున్నారు.
ఆర్డర్ బుక్ పటిష్ఠంగా ఉండటంతో మెరుగైన సేవలను అందించడం ద్వారా వ్యాపార వృద్ధి సానుకూలంగా ఉందని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ అన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి రాజేష్ గోపీనాథన్ స్థానంలో కంపెనీ సీఈఓగా కృతివాసన్ బాధ్యతలు చేపట్టనున్నారని కంపెనీ వెల్లడించింది. కాగా, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేర్ బుధవారం దాదాపు 1 శాతం పెరిగి రూ. 3,245.50 వద్ద ఉంది.
Also Read..