TCS: క్యాంపస్ నియామకాలు ప్రారంభించిన టీసీఎస్
సెప్టెంబర్‌లో ముగిసిన రెండో త్రైమాసికంలో మాత్రమే 5,726 మందిని నియమించింది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) క్యాంపస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియామకాల ప్రక్రియను ప్రారంభించినట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ.. ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ కొత్తగా 11,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్టు వెల్లడించింది. సెప్టెంబర్‌లో ముగిసిన రెండో త్రైమాసికంలో మాత్రమే 5,726 మందిని నియమించింది. దీంతో ఈ ఏడాది ప్రథమార్థం సమయానికి కంపెనీలో మొత్తం 6.12 లక్షల మంది ఉద్యోగులున్నారు. కొత్తగా వచ్చిన 11 వేల మందిని తీసుకోవడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం కూడా క్యాంపస్ నియామకాలను మొదలుపెట్టినట్టు టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. గతేడాది 19 ఏళ్లలోనే మొదటిసారి టీసీఎస్‌లో 13,249 మంది ఉద్యోగులు తగ్గారు. దీన్ని అధిగమించేందుకే నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మెరుగైన నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సామర్థ్యం ద్వారా కీలకమైన టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం కంపెనీ సిద్ధంగా ఉందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.