Airtel: రూ. 3,626 కోట్ల స్పెక్ట్రమ్ బకాయి చెల్లించిన ఎయిర్‌టెల్
2016 నాటి స్పెక్ట్రమ్‌కు సంబంధించి అన్ని బకాయిలతో కలిపి రూ. 3,626 కోట్లను డీఓటీకి చెల్లించినట్టు తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ భారీ మొత్తంలో స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించింది. 2016 నాటి స్పెక్ట్రమ్‌కు సంబంధించి అన్ని బకాయిలతో కలిపి రూ. 3,626 కోట్లను టెలికాం విభాగానికి(డీఓటీ) చెల్లించినట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ చెల్లింపు కారణంగా కంపెనీకి వార్షిక వడ్డీ ఖర్చులు కలిసొస్తాయని, దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో 4జీ కవరేజిని పెంచేందుకు నిధులు ఆదా అవుతాయని కంపెనీ అభిప్రాయపడింది. దీంతో మొత్తంగా 2024లో ఎయిర్‌టెల్ కంపెనీ రూ. 28,320 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించేసింది. తాజా చెల్లింపుల మొత్తంలో ఎక్కువ భాగం కంపెనీ స్వంత నిధుల నుంచి కేటాయించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రమ్ బకాయి చెల్లింపుల నేపథ్యంలో గురువారం కంపెనీ షేర్ ధర స్వల్పంగా పుంజుకుని రూ. 1,599 వద్ద ముగిశాయి.