రూ. 75 డివిడెండ్ ప్రకటించిన TCS
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి భారీ డివిడెండ్‌ను ప్రకటించింది
ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌పై వాటాదారులకు స్పెషల్ డివిడెండ్ రూ. 67 కలిపి మొత్తంగా రూ. 75 డివిడెండ్ ఇవ్వనున్నట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. డివిడెండ్ పొందేందుకు రికార్డ్ తేదీని ఈ నెల 17గా కంపెనీ నిర్ణయించింది. వచ్చే నెల 3వ తేదీన డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయని టీసీఎస్ పేర్కొంది.
ఇక, సమీక్షించిన త్రైమాసికానికి సంబంధించి కంపెనీ నికర లాభం రూ. 10,846 కోట్లతో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ రూ. 9,769 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ. 48,885 కోట్ల నుంచి 19.1 శాతం పుంజుకుని రూ. 58,229 కోట్లకు చేరిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
అట్రిషన్ రేటు 21.5 శాతం నుంచి 21.3 శాతానికి స్వల్పంగా తగ్గిందని, ఈ త్రైమాసికంలో కంపెనీ 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను పొందినట్టు టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ బాటలోనే మరో సంస్థ!