Vistara To Merge With Air India
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద ఒప్పందం జరిగింది.
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద ఒప్పందం జరిగింది. ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను టాటా కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ) అంగీకరించినట్టు ప్రకటించింది. లావాదేవీల్లో భాగంగా విలీనం పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియాలో రూ. 2,059 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎస్ఐఏ అంగీకరించింది.
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూపునకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం వాటా ఎస్ఐఏ వద్ద ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్ తన పెట్టుబడి ద్వారా ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను దక్కించుకోనుంది. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఈ విలీన ప్రక్రియను 2024, మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి.
అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు, 2023-24 లో కూడా ఎయిర్ ఇండియా వృద్ధి, కార్యకలాపాలకు అవసరమైతే నిధులు సమకూర్చేందుకు ఇరు సంస్థలు అదనపు మూలధనాన్ని సమకూర్చనున్నాయి.
కాగా, గతేడాది టాటా గ్రూప్ రూ. 18 వేల కోట్లతో ఎయిర్ ఇండియా ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటా ఎయిర్ఇండీయా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియాలను నిర్వహిస్తోంది. రాబోయే రెండేళ్ల వ్యవధిలో వీటిని సైతం విలీనం చేయాలని భావిస్తోంది. దీనివల్ల ఎయిర్ ఇండియాలో మొత్తం విమానాల సంఖ్య 218 కి పెరగనుంది.