రూ. 1.25 లక్షల కోట్లతో ఆల్‌టైం రికార్డు స్థాయికి స్వీట్లు, స్నాక్స్ వ్యాపారం!
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్ వ్యాపారులకు కలిసి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాల జోరును అందుకోనున్నాయని పరిశ్రమల సంఘం వెల్లడించింది.
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్ వ్యాపారులకు కలిసి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాల జోరును అందుకోనున్నాయని పరిశ్రమల సంఘం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్‌లో స్వీట్లు, స్నాక్స్ అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుంటాయని స్వీట్లు, స్నాక్స్ తయారీ సంఘం డైరెక్టర్ ఫిరోజ్ హెచ్ నఖ్వీ అన్నారు. గత నెల రాఖీ సందర్భంగా స్వీట్లు, స్నాక్స్ వ్యాపారం భారీగా పెరిగిందన్నారు. గతవారం మొదలైన గణేశ్ ఉత్సవాలతో స్వీట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
రాబోయే దసరా, దీపావళి, హోళీ పండుగలతో అమ్మకాల ధోరణి కొనసాగుతుందని నఖ్వీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ స్వీట్లు, స్నాక్స్ పండుగలలో ముఖ్యమైన భాగం కావడం వ్యాపారాలకు కలిసొస్తుంది. ఈ సీజన్‌లో ప్రజలు దుస్తులు, ఆభరణాల ఖర్చులు తగ్గించుకోవచ్చేమో కానీ స్వీట్లు, స్నాక్స్ కొంటారని నఖ్వీ చెప్పారు. 2020-21లో రూ. 35 వేల కోట్ల నష్టాలను చూసిన వ్యాపారం, ఆ తర్వాత పుంజుకుని 2021-22లో స్వీట్లు, స్నాక్స్ అమ్మకాలు రూ. 1.10 లక్షల కోట్లకు పెరిగాయని, ఈ ఏడాది ఇది మరింత గణనీయమైన వృద్ధి ఉంటుందని నఖ్వీ వివరించారు. పరిశ్రమ ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగా కూడా ఏడాదికి కోటి మందికి పైగా ఉపాధి పొందుతున్నారని నఖ్వీ వెల్లడించారు.