లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో బలహీనపడిన మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి.

Update: 2023-03-27 12:36 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో బలహీనపడిన మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత మిడ్-సెషన్ సమయంలో కాసేపు నష్టాలను చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక కంపెనీ షేర్లలో కొనుగోళ్లతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు చెందిన డిపాజిట్లు, ఆస్తులను ఫస్ట్ సిటిజన్ బ్యాంకుకు ఎఫ్‌డీఆఇసీ విక్రయించడంతో గ్లోబల్ మార్కెట్లు మెరుగ్గా ర్యాలీ చేశాయి.

అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి, ప్రపంచ వృద్ధిపై ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లలో మోస్తరు లాభాలు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 126.76 పాయింట్లు లాభపడి 57,653 వద్ద, నిఫ్టీ 40.65 పాయింట్లు పెరిగి 16,985 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.38 వద్ద ఉంది.

Tags:    

Similar News