అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూల సంకేతాలివ్వడం, దేశీయంగా కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన లాభాలను సాధించాయి

Update: 2023-04-05 11:45 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూల సంకేతాలివ్వడం, దేశీయంగా కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఐటీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.

తాజాగా ప్రభుత్వం ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్నును సున్నాకి తగ్గించి, డీజిల్‌పై సగానికి తగ్గించడం మార్కెట్లలో జోష్‌ను పెంచింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 582.87 పాయింట్లు ఎగసి 59,689 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 17,557 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, టీసీఎస్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి.

ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, నెస్లే ఇండియా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.05 వద్ద ఉంది.

Tags:    

Similar News