వారాంతం నష్టాల్లో ముగిసిన సూచీలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

Update: 2023-02-10 11:27 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. వారాంతం కావడం వల్ల మదుపర్లు ప్రతికూలంగా స్పందించడంతో సూచీలు ఉదయం నుంచే నష్టాల్లో ర్యాలీ అయ్యాయి. ఎంఎస్‌సీఐలో అదానీ కంపెనీల వెయిటీజీ తగ్గుతుందనే వార్తలతో ఆయా కంపెనీల షేర్లు పతనమవడంతో పాటు గత నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లలో బలహీన ట్రేడింగ్ కనిపించింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సైతం ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.52 పాయింట్లు పడిపోయి 60,682 వద్ద, నిఫ్టీ 36.95 పాయింట్లు నష్టపోయి 17,856 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం 1 శాతానికి పైగా బలహీనపడగా, రియల్టీ రంగం రాణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.58 వద్ద ఉంది.

Tags:    

Similar News