ఒడిదుడుకులు కానీ చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా మార్చి త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఆదాయ వివరాలపై మదుపర్లు దృష్టి సారించడంతో సూచీలు స్థిరంగా కదలాడాయి

Update: 2023-04-25 11:00 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా మార్చి త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఆదాయ వివరాలపై మదుపర్లు దృష్టి సారించడంతో సూచీలు స్థిరంగా కదలాడాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి ఊగిసలాటకు గురైన స్టాక్ మార్కెట్లు ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో జరిగిన షేర్ల కొనుగోళ్లతో లాభాలను కొనసాగించాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి ఒత్తిడి ఎదురైనప్పటికీ దేశీయ సూచీలు లాభాలను నిలబెట్టుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 74.61 పాయింట్లు లాభపడి 60,130 వద్ద, నిఫ్టీ 25.85 పాయింట్లు పెరిగి 17,769 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించగా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, విప్రో కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.92 వద్ద ఉంది.

Also Read..

ఎంజీ మోటార్, బీవైడీ ఇండియాతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు!

Tags:    

Similar News