మోడీని అభినందించిన స్టార్టప్ వ్యవస్థాపకులు
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ప్రయోజనాలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలను AI, స్టార్టప్ వ్యవస్థాపకులు శనివారం ప్రశంసించారు
దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ప్రయోజనాలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలను AI, స్టార్టప్ వ్యవస్థాపకులు శనివారం ప్రశంసించారు. ప్రస్తుతం భారత్ డిజిటల్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. యూపీఐ చెల్లింపులు, ఆధార్, ఇతర డిపిఐ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. క్షణాల్లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావడం వంటి సాంకేతికత ప్రజలందరికి చేరడంలో ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు భారత్‌ను ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందు ఉంచుతాయని AI- ఆధారిత వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫాం ఇన్‌వీడియో CEO సంకేత్ షా అన్నారు. ఇటీవల నాస్కామ్ నేతృత్వంలోని నివేదిక, యూపీఐ, ఆధార్ వంటి డిపిఐలు 2030 నాటికి భారతదేశాన్ని 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాయని, దేశం 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని పేర్కొంది. తాజాగా బిల్‌గేట్స్‌తో సమావేశమైన ప్రధాని మోడీ డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం అద్భుతమైన పురోగతిని ఆయనకు వివరించారు.