భారత స్పేస్-టెక్ రంగంలో అత్యధిక నిధులు సేకరించిన హైదరాబాద్ స్టార్టప్!
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ తయారీ సంస్థ స్కైరూట్ ఏవియేషన్ భారీ మొత్తంలో నిధులను సమీకరించింది.
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ తయారీ సంస్థ స్కైరూట్ ఏవియేషన్ భారీ మొత్తంలో నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫైనాన్స్ రౌండ్‌లో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ సుమారు రూ. 403 కోట్ల నిధులను సేకరించింది. అంతరిక్ష సాంకేతిక (స్పేస్-టెక్) రంగంలో ఇదే అత్యధిక నిధుల సమీకరణ కావడం విశేషం. సింగపూర్ దీర్ఘకాలిక పెట్టుబడి సంస్థ జీఐసీ ఈ సేకరణకు నాయకత్వం వహించింది.
ఈ పెట్టుబడులతో జీఐసీ ఇండియా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ రావత్ స్కైరూట్ బోర్డులో చేరనున్నారు. తాజా నిధులను ప్రధానంగా అభివృద్ధి ప్రయోగాల కోసం, వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ స్థాయికి చేరుకునేందుకు, ఇతర మౌలిక సదుపాయాలను రూపొందించేందుకు వినియోగించనున్నట్టు స్కైరూట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ అన్నారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లు ఎంతో కీలకమైనవి. గతేడాది వరకూ దేశీయంగా ఇస్రో మాత్రమే రాకెట్లను తయారు చేసేది. తొలిసారిగా ఈ రంగంలోకి హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏవియేషన్ అడుగుపెట్టింది.
ఈ స్టార్టప్‌ను స్థాపించిన వారిలో పవన్ కుమార్ చందన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరిన పవన్ కుమార్, తర్వాతి కాలంలో సహ శాస్త్రవేత్త నాగ భరత్‌తో కలిసి స్కైరూట్‌ను 2018లో ప్రారంభించారు. ప్రస్తుత కంపెనీ సీఓఓగా ఉన్న నాగ భరత్ ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. కొన్నేళ్ల పాటు ఇస్రోలో రాకెట్ సైన్స్‌పై అనుభవం గడించిన తర్వాత వీరిద్దరూ స్కైరూట్ ఏరోస్పేస్‌ను స్థాపించారు.