Gold: దిగుమతి సుంకం కోతతో పెరిగిన జ్యువెలరీ రిటైలర్ల ఆదాయం
ధరలు తగ్గడంతో రిటైలర్లు ఊహించిన డిమాండ్‌ను చూశారు. మార్కెటింగ్, ప్రచార ఖర్చులు తగ్గాయని క్రిసిల్ అభిప్రాయపడింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమగ్ర బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల రిటైలర్ల ఆదాయాలు 22-25 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ పరిశోధనా సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ఇది అంతకుముందు అంచనా వేసిన 17-19 శాతం కంటే చాలా ఎక్కువ. దిగుమతి సుంకం తగ్గింపు కారణంగా రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు రూ. 5 వేల వరకు తగ్గాయి. దీనివల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. అకస్మాత్తుగా ధరలు తగ్గడంతో రిటైలర్లు ఊహించని డిమాండ్‌ను చూశారు. ఇదే సమయంలో వారికి మార్కెటింగ్, ప్రచార ఖర్చులు తగ్గాయని క్రిసిల్ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ ఏడాది అనేక జ్యువెలరీ యజమానులు కొత్త స్టోర్ల విస్తరణకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల తగ్గిన ధరలు మరింత ప్రయోజనాలను అందిస్తాయి. బంగారు ఆభరణాల రిటైలర్లు ఆగష్టు చివరి నుంచి మొదలైన పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ల కోసం పసిడి నిల్వను పెంచే సమయంలో దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటన రావడం పరిశ్రమ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు, ఇతర కారణాలతో బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అలాగే ప్రభుత్వం నిబంధనలు, దిగుమతి సుంకాల్లో మార్పుల వల్ల వినియోగదారుల సెంటిమెంట్ ప్రభావం అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది.