Stock Market: కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరిన సూచీలు

దేశీయంగా కీలక బ్లూచిప్ స్టాక్స్‌లో షేర్ల కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలకు కారణమయ్యాయి.

Update: 2024-08-29 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. అంతకుముందు సెషన్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక బ్లూచిప్ స్టాక్స్‌లో షేర్ల కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలకు కారణమయ్యాయి. ప్రధానంగా రిలయన్స్ సంస్థ ఏజీఎం సమావేశం కారణంగా కంపెనీ షేర్లు 1.5 శాతానికి పైగా పుంజుకున్నాయి. అలాగే, ఐటీసీ, టాటా మోటార్స్ స్టాక్స్ సైతం రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 82,285 వద్ద ఆల్‌టైమ్ హై స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం 25,192 రికార్డు గరిష్ఠాలను తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 349.05 పాయింట్లు లాభపడి 82,134 వద్ద, నిఫ్టీ 99.60 పుంజుకుని 25,151 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, రిలయన్స్, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.91 వద్ద ఉంది. 

Tags:    

Similar News