Stock Market: అధిక నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గ్లోబల్ మార్కెట్లలో కమొడిటీ ధరలు బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈవారం నష్టాలతో ప్రారంభించాయి. ప్రధాన హెవీవెయిడ్ మెటల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలపై మదుపర్లు ఎక్కువ దృష్టి సారించడంతో నష్టాలు తప్పలేదు. వీటితో పాటు గ్లోబల్ మార్కెట్లలో కమొడిటీ ధరలు బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 384.55 పాయింట్లు క్షీణించి 81,748 వద్ద, నిఫ్టీ 100.05 పాయింట్ల నష్టంతో 24,668 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించగా, మెటల్, ఐటీ రంగాలు పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టైటాన్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఆల్ట్రాసిమెంట్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.89 వద్ద ఉంది.