మోడీ 3.0 హవా.. స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీ
ప్రస్తుత ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సూచీలు 3 శాతానికి పైగా లాభపడి జోరు కొనసాగించాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ప్రధానంగా దేశీయ లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సూచీలు 3 శాతానికి పైగా లాభపడి జోరు కొనసాగించాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు, ఆసియా మార్కెట్ల ర్యాలీ, రూపాయి బలపడటం వంటి అంశాలు రికార్డు లాభాలకు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఊహించని స్థాయిలో 2,500 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా ఎగిశాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రికార్డు ర్యాలీలో మదుపర్ల సంపద ఏకంగా రూ.13.79 లక్షల కోట్లు పెరిగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ తొలిసారి 76,738 మార్కు, నిఫ్టీ సైతం 23,338 వద్ద ఆల్‌టైమ్ హై లెవల్స్‌ని తాకాయి. అంతేకాకుండా 2009 తర్వాత లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల అతిపెద్ద వన్-డే ర్యాలీని సాధించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,507 పాయింట్లు ఎగసి 76,468 వద్ద, నిఫ్టీ 733 పాయింట్లు పుంజుకుని 23,263 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు 3-9 శాతం మధ్య దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు 5-10 శాతం మధ్య పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్ తక్కువ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.10 వద్ద ఉంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.425.91 లక్షల కోట్లకు చేరుకుంది.