సరికొత్త రికార్డులను తాకిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 77,145, నిఫ్టీ 23,481 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

Update: 2024-06-13 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. గత మూడు సెషన్లలో రాణించిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో సైతం మెరుగైన కొనుగోళ్లతో సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 77,145, నిఫ్టీ 23,481 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి. భారత్‌తో పాటు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, గ్లోబల్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 204.33 పాయింట్లు లాభపడి 76,810 వద్ద, నిఫ్టీ 75.95 పాయింట్ల లాభంతో 23,398 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.56 వద్ద ఉంది. 


Similar News