భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెప్టెంబర్ నెలను అద్భుతంగా ప్రారంభించాయి.

Update: 2023-09-01 11:17 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెప్టెంబర్ నెలను అద్భుతంగా ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించడం, దేశీయంగా జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాల డేటా మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి. వీటితో పాటు అంతకుముందు రోజున జూన్ త్రైమాసికానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు తగిన స్థాయిలో నమోదవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 555.75 పాయింట్లు ఎగసి 65,387 వద్ద, నిఫ్టీ 181.50 పాయింట్లు లాభపడి 19,435 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్ మాత్రమే బలహీనపడ్డాయి. మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.71 వద్ద ఉంది. హిండెన్‌బర్గ్ తరహాలో అదానీ గ్రూప్‌పై తాజాగా ఓసీసీఆర్‌పీ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల షేర్లు వారాంతం రోజున తిరిగి పుంజుకున్నాయి. మరోవైపు, ఓసీసీఆర్‌పీ దేశీయ మైనింగ్ దిగ్గజం వేదాంతపై కూడా ఆరోపణలు చేసింది. అయినప్పటికీ శుక్రవారం ట్రేడింగ్‌లో వేదాంత షేర్ 1.59 శాతం పెరిగి రూ. 236 వద్ద ముగియడం గమనార్హం.


Similar News