చివరి గంటలో కొనుగోళ్లతో లాభపడ్డ సూచీలు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి. అంతకుముందు ట్రేడింగ్‌లో బలహీనపడిన సూచీలు గురువారం ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. రోజంతా అదే ధోరణిలో ఊగిసలాటకు గురైనప్పటికీ చివర్లో కొనుగోళ్ల మద్దతు కారణంగా మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి.
డెరివేటివ్స్ గడువు ముగింపు రోజు కావడంతో ఉదయం నుంచి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు, దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది. అయితే, ఆఖరు గంటలో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లను చేపట్టారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 98.84 పాయింట్లు పెరిగి 61,872 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లాభపడి 18,321 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.
విప్రో, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.75 వద్ద ఉంది.