స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ఉత్సాహం

మూలధన వ్యయానికి కేటాయింపులు పెంచడంతో మిడ్‌సెషన్‌కు ముందు ర్యాలీ ఓ దశలో కీలక సెన్సెక్స్ 73 వేల మార్కును తాకింది.

Update: 2024-02-02 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అంతకుముందు సెషన్‌లో కేంద్ర బడ్జెట్ ప్రకటనలో ఆశించిన చర్యలు లేకపోవడంతో బలహీనపడిన సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో ఉత్సాహంగా ర్యాలీ చేశాయి. మూలధన వ్యయానికి కేటాయింపులు పెంచడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. మిడ్‌సెషన్‌కు ముందు ర్యాలీ అమాంతం పెరిగి ఓ దశలో కీలక సెన్సెక్స్ 73 వేల మార్కును తాకింది. ఆ తర్వాత గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో లాభాలు తగ్గాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, కీలక రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మద్దతిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 440.33 పాయింట్లు ఎగసి 72,085 వద్ద, నిఫ్టీ 156.35 పాయింట్లు లాభపడి 21,853 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలను సాధించాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎల్అండ్‌టీ, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.91 వద్ద ఉంది.

Tags:    

Similar News