Stock Market: వారాంతం రూ. 6.34 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు

ఈ క్రమంలో సెన్సెక్స్ 1,000కి పైగా పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ సైతం 290 పాయింట్ల కంటే ఎక్కువ పతనమైంది

Update: 2024-09-06 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో బలహీన ర్యాలీతో పాటు మన ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నిధులను వెనక్కి తీసుకెళ్లడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,000కి పైగా పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ సైతం 290 పాయింట్ల కంటే ఎక్కువ పతనమైంది. గురువారం అమెరికా జాబ్ డేటా వెలువడనున్న కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలపైనా ఒత్తిడిని పెంచాయి. దీనికితోడు దేశీయంగా సూచీలు గత కొన్ని సెషన్‌ల నుంచి రికార్డు స్థాయిలో ర్యాలీ అవుతున్నాయి. తాజా పరిణామాలతో లాభాల స్వీకరణ, ప్రతికూల సంకేతాలకు మదుపర్లు షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 6.34 లక్షల కోట్లకు పైగా కోల్పోయారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు పతనమై 81,183 వద్ద, నిఫ్టీ 292.95 పాయింట్లు కోల్పోయి 24,852 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా 3.57 శాతం క్షీణించగా, మిగిలిన రంగాలు సైతం 1 శాతానికి మించి కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, టాటా మోటార్స్ స్టాక్స్ అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.

Tags:    

Similar News