Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న రికార్డు లాభాలు

దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల ర్యాలీ దోహదపడ్డాయి

Update: 2024-09-25 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు కొనసగుతున్నాయి. గత మూడు సెషన్లుగా ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకుతున్న సూచీలు బుధవారం సైతం అంతే ఉత్సాహంగా రికార్డు గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేనప్పటికీ దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల ర్యాలీ దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ తొలిసారిగా 26,000 మైలురాయిని అధిగమించింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీన ట్రేడింగ్, దేశీయంగా మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు లాభాలను వెనక్కి తీసుకోవడంతో ఉదయం నుంచి మిడ్-సెషన్ తర్వాత వరకు ఫ్లాట్‌గా కదలాడాయి. అయితే, చివరి గంటలో కీలక బ్లూచిప్ స్టాక్స్‌తో పాటు ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ లాంటి సంస్థల షేర్లలో కొనుగోళ్లు ఉత్సాహాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 85,247 వద్ద కొత్త గరిష్ఠాలను తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 255.83 పాయింట్లు లాభపడి 85,169 వద్ద, నిఫ్టీ 63.75 పాయింట్ల లాభంతో 26,004 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా రంగం దాదాపు 3 శాతం పుంజుకోగా, ఫైనాన్స్, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టైటాన్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.57 వద్ద ఉంది. 

Tags:    

Similar News