నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడంతో నష్టాలు తప్పలేదు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఒకరోజు సెలవు తర్వాత ఈ వారం ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడంతో నష్టాలు తప్పలేదు. కీలక రిలయన్స్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు పతనమవడం కూడా మార్కెట్లు బలహీనపడేందుకు కారణమయ్యాయి. ఇదే సమయంలో దేశీయ ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు సన్నగిల్లడం సూచీల్లో ఒత్తిడి పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 361.64 పాయింట్లు కోల్పోయి 72,470 వద్ద, నిఫ్టీ 92.05 పాయింట్లు నష్టపోయి 22,004 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఐటీ, మీడియా రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.31 వద్ద ఉంది.