స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు

రికార్డు గరిష్ఠాల వద్ద కొంత ఊగిసలాట ఎదురైనప్పటికీ మిడ్-సెషన్ తర్వాత నుంచి మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించారు.

Update: 2024-06-20 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. దేశీయ పరిణామాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల మద్దతు నేపథ్యంలో సూచీలు వరుసగా ఆరో సెషన్ లాభపడ్డాయి. రికార్డు గరిష్ఠాల వద్ద కొంత ఊగిసలాట ఎదురైనప్పటికీ మిడ్-సెషన్ తర్వాత నుంచి మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 141.34 పాయింట్లు లాభపడి 77,478 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను సాధించాయి. సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, విప్రో, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.62 వద్ద ఉంది. వరుస సెషన్‌లలో స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగడంతో మదుపర్ల సంపద గురువారం రూ. 1.86 లక్షల కోట్లకు పెరగ్గా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 435.81 లక్షల కోట్లకు చేరుకుంది. 


Similar News