ఆఖర్లో బలహీనపడిన సూచీలు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Update: 2023-08-30 12:16 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత మెరుగైన ర్యాలీని చూసిన మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత నెమ్మదించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ, దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు బలహీనపడ్డాయి.

మిడ్-సెషన్ తర్వాత కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఆఖర్లో మునుపటి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లలో అమ్మకాల ఒత్తిడి అత్యధికంగా కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 11.43 పాయింట్లు మాత్రమే లాభపడి 65,087 వద్ద, నిఫ్టీ కేవలం 4.80 పాయింట్లు పెరిగి 19,347 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో రియల్టీ, మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జియో ఫైనాన్స్ 4.99 శాతంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకగా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.71 వద్ద ఉంది.


Similar News