తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్న తర్వాత సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా ఉదయం లాభాల్లోనే మొదలైన మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత నుంచి నెమ్మదిగా బలహీనపడ్డాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 17.39 పాయింట్లు లాభపడి 73,895 వద్ద, నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో 22,442 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగ దాదాపు 4 శాతం క్షీణించగా, మీడియా, మెటల్, ఫైనాన్స్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టైటాన్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది.