Stock Market: కొత్త రికార్డు గరిష్ఠాలను తాకిన సూచీలు

విదేశీ నిధుల ప్రవాహంతో దేశ వృద్ధి స్థిరంగా కొనసాగుతుందనే సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి.

Update: 2024-09-16 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. గత వారాంతం గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా దెబ్బతిన్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో రాణించాయి. ముఖ్యంగా అమెరికా జాబ్ డేటాలో తగ్గుదల, ఫెడ్ కీలక రేట్లను సవరిస్తుందనే అంచనాలు పెరగడం, తద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పుంజుకునే అవకాశాలు ఉండటం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే సానుకూల మద్దతుతో దేశీయ మార్కెట్లలో ర్యాలీ సానుకూలంగా కొనసాగింది. ఫెడ్ ప్రభావంతో పాటు మన మార్కెట్లలో విదేశీ నిధుల ప్రవాహం కారణంగా దేశ వృద్ధి స్థిరంగా కొనసాగుతుందనే సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.84 పాయింట్లు లాభపడి 82,988 వద్ద, నిఫ్టీ 27.25 పాయింట్లు పెరిగి 25,383 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను సాధించాయి. బజాజ్ ఫైనాన్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, టైటాన్, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.87 వద్ద ఉంది. 

Tags:    

Similar News