616 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ప్రధానంగా అమెరికా మార్కెట్ల నుంచి బలహీన ర్యాలీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గతవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్ల నుంచి బలహీన ర్యాలీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. టాటా సన్స్ ఐపీఓ ప్రక్రియ సంధిగ్ధంలో పడటంతో టాటా గ్రూపునకు చెందిన దాదాపు అన్ని స్టాక్‌లు అధికంగా నష్టపోయాయి. వీటికి తోడు మంగళవారం కీలక దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 616.75 పాయింట్లు కుదేలై 73,502 వద్ద, నిఫ్టీ 160.90 పాయింట్లు నష్టపోయి 22,332 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్, మీడియా, రియల్టీ రంగాలు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.76 వద్ద ఉంది. మార్కెట్లలో భారీ నష్టాల కారణంగా మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 3.15 లక్షల కోట్లు ఆవిరై రూ. 389.66 లక్షల కోట్లకు చేరింది.