ఏప్రిల్ తర్వాత 18,000 మార్కు దాటిన నిఫ్టీ!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు మరోసారి మెరుగైన లాభాలతో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు మరోసారి మెరుగైన లాభాలతో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా మదుపర్లు కొనుగోళ్ల దూకుడును కొనసాగించచడంతో బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లో పుంజుకున్నాయి. సోమవారం విడుదలైన గణాంకాల్లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లభించడంతో ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలోనే నిఫ్టీ ఏప్రిల్ తర్వాత మొదటిసారిగా తన కీలక 18,000 మార్కును అధిగమించింది.
ముఖ్యంగా రూపాయి మారకం విలువ బలపడటం, భారత ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు కొనసాగడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు దేశీయ మార్కెట్ల లాభాలకు సహాయపడ్డాయని విశ్లేషకులు పేర్కోన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 455.95 పాయింట్లు ఎగసి 60,571 వద్ద, నిఫ్టీ 133.70 పాయింట్లు లాభపడి 18,070 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు స్వల్పంగా నీరసించగా, మెటల్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, అజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.17 వద్ద ఉంది.