లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి.

Update: 2023-08-07 11:11 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయ కీలక టీసీఎస్, రిలయన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ సూచీలు రాణించడం విశేషం. వీటికి తోడు ఈవారంలో అమెరికా ద్రవ్యోల్బణ డేటా, ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి మధ్యే లాభాలను చూశాయి. ప్రధానంగా ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతిచ్చాయి. దేశీయ ఆన్‌లైన్ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం షేర్లు మెరుగైన ర్యాలీ చేశాయి. సంస్థ వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ యాంట్‌ఫిన్ నుంచి 10.30 శాతం పేటీఎం వాటాను కొన్నారనే వార్తల నేపథ్యంలో 11 శాతం పుంజుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.23 పాయింట్లు పెరిగి 65,953 వద్ద, నిఫ్టీ 80.30 పాయింట్లు లాభపడి 19,597 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం అత్యధికంగా 4 శాతానికి మించి పెరిగింది. సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.75 వద్ద ఉంది.


Similar News