ఈ ఏడాది నియామకాల్లో 85 శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకే ఛాన్స్: ఎస్‌బీఐ
ఈ ఏడాది దాదాపు 12,000 మంది ఫ్రెషర్ల నియామకానికి బ్యాంకు నిర్ణయించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తీసుకునే ఉద్యోగుల్లో 85 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లనే తీసుకోనున్నట్టు బ్యాంక్ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. ఈ ఏడాది దాదాపు 12,000 మంది ఫ్రెషర్ల నియామకానికి బ్యాంకు నిర్ణయించింది. ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్‌ల పాత్రల్లో వీరి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను బ్యాంకు చేపట్టనుంది. గత కొన్ని నెలలుగా ఐటీ రంగంలో నియామకాలు క్షీణించిన నేపథ్యంలో బ్యాంకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడం గమనార్హం. ప్రొబేషనరీ ఆఫీసర్, అసోసియేట్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థారాల్లో శిక్షణ ఇచ్చి, పలు విభాగాల్లో నియామకాలు చేపడతామని దినేష్ ఖారా తెలిపారు. 'బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. టెక్నాలజీ ద్వారానే వినియోగదారులకు సేవలందించడం జరుగుతోంది. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు ఈ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి మేము శిక్షణ తీసుకున్న వారికి ప్రతిభ ఆధారంగా వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలను అప్పగిస్తామని ' దినేష్ ఖారా వివరించారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ తెలిసిన ఉద్యోగుల అవసరం ఉందన్నారు. ఎస్‌బీఐ విషయంలో టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక ఇన్‌హౌస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తామాని, దీనికి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నట్టు దినేష్ ఖారా చెప్పారు. అలాగే, దీని గురించి ఆర్‌బీఐ నుంచి కూడా అవసరమైన మార్గదర్శకాలు ఉన్నాయి. టెక్నాలజీ విషయంలో బ్యాంకులు తప్పులు చేస్తే ఆర్‌బీఐ పెద్ద ఎత్తున జరిమానా కూడా విధిస్తోందని దినేష్ ఖారా వెల్లడించారు.