SBI personal Loan : పర్సనల్ లోన్ విభాగంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన SBI

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి రూ. 5 లక్షల కోట్ల మార్కును అధిగమించిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది

Update: 2022-12-05 09:51 GMT

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి రూ. 5 లక్షల కోట్ల మార్కును అధిగమించిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, పెన్షన్, ఆటో, విద్య, బంగారంతో కూడిన పోర్ట్‌ఫోలియోలో గత ఏడాది కాలంలో రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను ఇచ్చినట్టు బ్యాంకు పేర్కొంది. ఇందులో గృహ రుణాలు ఉండవు.

గత కొన్నేళ్లలో ఎస్‌బీఐ కీలకమైన నిర్ణయాలు, వ్యూహాత్మక చర్యలు, డిజిటల్ వినియోగాన్ని పెంచడం ద్వారా పర్సనల్ లోన్ విభాగంలో రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటామని, మొత్తం బ్యాంకింగ్ పరిశ్రమలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ఓ ప్రకటనలో అన్నారు.

బ్యాంకు ప్రధానంగా వ్యక్తిగత రుణాల విస్తరణకు వేతన జీవులతో పాటు మెరుగైన ఆర్థిక ప్రొఫైల్ ఉన్నవారిపై దృష్టి సారించిందని బ్యాంకు తెలిపింది. 2015లో మొదటిసారి బ్యాంకు వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియోలో రూ. లక్షల కోట్ల మార్కును చేరుకుంది. ఆ తర్వాత 2018, జనవరిలో రూ. 2 లక్షల కోట్లు, కరోనా మహమ్మారి తీవ్రంగా 2020, ఆగష్టులో రూ. 3 లక్షల కోట్లు, 2021, నవంబర్‌లో రూ. 4 లక్షల కోట్ల మార్కును చేరుకున్నట్టు ఎస్‌బీఐ వివరించింది.

గృహ రుణాల విభాగంలో ఎస్‌బీఐ 2021, జనవరిలోనే రూ. 5 లక్షల కోట్ల మైలురాయిని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల కోట్లకు, 2026-27 నాటికి రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటామని బ్యాంకు అంచనా వేస్తోంది. యువతలో సొంత ఇంటి పై ఆసక్తి పెరగడం, పెరుగుతున్న ఆదాయాలు, స్టాంప్ డ్యూటీ, సబ్సిడీ వంటి అంశాలు గృహ రుణాల పోర్ట్‌ఫోలియో వృద్ధికి మద్దతిస్తాయని బ్యాంకు వెల్లడించింది.

Tags:    

Similar News