Credit Card Transactions: నవంబర్ లో భారీగా తగ్గిన క్రెడిట్ కార్డు చెల్లింపులు..!
దేశీయంగా నవంబర్(November)లో క్రెడిట్ కార్డుల(Credit Cards) ద్వారా చేసిన చెల్లింపులు గణనీయంగా తగ్గాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా నవంబర్(November)లో క్రెడిట్ కార్డుల(Credit Cards) ద్వారా చేసిన చెల్లింపులు గణనీయంగా తగ్గాయి. అక్టోబర్(October)లో దసరా(Dussehra), దీపావళి(Diwali) పండగలు ఉండటంతో ఆ నెలలో ఏకంగా క్రెడిట్ కార్డు ద్వారా 2.02 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. అయితే పండగ సీజన్ ముగియడంతో గత నవంబర్ నెలలో 1.70 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు చెల్లింపులు జరిగాయి. అక్టోబర్ నెలతో పోల్చుకుంటే నవంబర్ నెలలో క్రెడిట్ కార్డు వ్యయాలు సుమారు 16.1 శాతం క్షీణించాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ నివేదికలో పేర్కొంది.
ఇక ఆఫ్ లైన్(Offline)లో జరిగే పాయింట్ ఆఫ్ సేల్(POS) లావాదేవీలు 14 శాతం తగ్గితే.. ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్(Online Transactions) 17.5 శాతం తగ్గాయి. ఇక క్రెడిట్ కార్డుల జారీ విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అత్యధికంగా 2,31,058 కార్డులను జారీ చేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) 1,87,118, ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) 50,767, యాక్సిస్ బ్యాంక్(Axis Bank) 39,734 కార్డులతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. మొత్తం అక్టోబర్ లో 7,80,000 క్రెడిట్ కార్డులు జారీ కాగా.. నవంబర్ లో 3,50,000 కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. గతేడాది నవంబర్ నెలతో పోల్చుకుంటే ఈ సారి 73 శాతం తగ్గాయని ఆర్బీఐ వెల్లడించింది.