Credit Card ద్వారా కొనుగోళ్లపై రివార్డు పాయింట్లను తగ్గించిన ఎస్‌బీఐ!
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుకు సంబంధించి రివార్డు పాయింట్లను తగ్గించనున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుకు సంబంధించి రివార్డు పాయింట్లను తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఇప్పుడిస్తున్న రివార్డు పాయింట్లు సగానికి తగ్గుతాయని, ఈ మార్పులు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది.
క్లియర్‌ట్రిప్ వోచర్‌లు ఒకే లావాదేవీలో రీడీమ్ చేయబడతాయని, మరే ఇతర ఆఫర్ లేదా వోచర్‌తో కలుపబడదని స్పష్టం చేసింది. ఇది జనవరి 6వ తేదీ నుంచి అమలవుతుంది. అమెజాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనే వాటిపై ప్రస్తుతం ఇస్తున్న 10 రివార్డు పాయింట్లు జనవరి 1వ తేదీ నుంచి 5 రివార్డు పాయింట్లు మాత్రమే లభిస్తాయని ఎస్‌బీఐ తెలిపింది.
అపోలో, క్లియర్‌ట్రిప్, బుక్‌మై షో, లెన్స్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ కొనుగోళ్లకు మునుపటిలాగే 10 రివార్డు పాయింట్లు వస్తాయి. కాగా, గత నెల 15 నుంచి ఎస్‌బీఐ ఈఎంఐ లావాదేవీలపై విధించే ఛార్జీలను సవరించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఈఎంఐ లావాదేవీలకు రూ. 99 ప్రాసెసింగ్ ఫీజు ఉండగా, దీన్ని రూ. 199 కి పెంచారు.
ఇక, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించి ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం గతవారం జనవరి నుంచి క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.