ఇంకా రూ. 7,581 కోట్ల విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్దే: ఆర్‌బీఐ

ఇప్పటికీ రూ. 7,581 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని పేర్కొంది.

Update: 2024-07-01 10:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: చలామణిలో ఉన్న 2,000 నోట్లలో 97.87 శాతం నోట్లు బ్యాంకు వద్దకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సొమవారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ రూ. 7,581 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని పేర్కొంది. గతేడాది మే 19న ఆర్‌బీఐ 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించే సమయానికి దేశంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువ 2,000 నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. 2,000 నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రజల వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకునే సౌకర్యం దేశంలో 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. తొలుత అన్ని బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు అవకాశం కల్పించిన ఆర్‌బీఐ గతేడాది సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అక్టోబర్‌ 7 వరకు గడువు పొడిగించింది. అనంతరం ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను మార్చుకునే సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాకుండా దేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీసు నుంచి ఏదైనా ఆర్‌బీఐ కార్యాలయాలకు పోస్ట్ ద్వారా పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. 

Similar News