రోజంతా నష్టాల్లో ర్యాలీ చేసిన సూచీలు!

Update: 2023-10-03 11:27 GMT

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒకరోజు సెలవు తర్వాత మంగళవారం మొదలైన ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా ప్రతికూలంగా ర్యాలీ చేశాయి. ఈ వారంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుండటం, ద్రవ్యోల్బణ ఆందోళనలు, వృద్ధి రేటుపై ఆర్‌బీఐ స్పందన వంటి అంశాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి మారకం విలువ బలహీనపడటం వంటి అంశాలు మార్కెట్లను దెబ్బతీశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 316.31 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 109.55 పాయింట్లు నష్టపోయి 19,528 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, రియల్టీ రంగాలు సానుకూలంగా ఉన్నాయి. ఆటో, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.21 వద్ద ఉంది.


Similar News