రూ. 20 లక్షల కోట్లకు చేరిన మొట్టమొదటి భారత కంపెనీగా రిలయన్స్ రికార్డు

ట్రేడింగ్‌లో సంస్థ షేర్ ఓ దశలో 2 శాతం పుంజుకుని రూ. 2,953ని తాకింది. మార్కెట్ విలువ రూ. 20 లక్షల కోట్లకు చేరింది.

Update: 2024-02-13 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థ, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. మార్కెట్ విలువ పరంగా రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి భారత కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలోనే కంపెనీ షేర్ ధర ఇప్పటివరకు 14 శాతం పుంజుకోవడంతో రిలయన్స్ సంస్థ ఈ మైలురాయిని చేరుకుంది. మంగళవారం స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ సంస్థ షేర్ ధర రూ. 2,926.20 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో సంస్థ షేర్ ఓ దశలో 2 శాతం పుంజుకుని రూ. 2,953ని తాకింది. ఆ సమయంలోనే సంస్థ మార్కెట్ విలువ రూ. 20 లక్షల కోట్ల మార్కును తాకింది.

దేశీయంగా చమురు నుంచి టెలికాం వరకు అనేక రంగాల్లో విస్తరించిన రిలయన్స్ సంస్థ 2005లో మొదటిసారిగా రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు 2007లో రూ. 2 లక్షల కోట్లను, అదే ఏడాది రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 2017లో రూ. 5 లక్షల కోట్లకు చేరిన తర్వాత దేశీయంగా టెలికాం రంగం సహా పలు కీలక రంగాలకు వేగంగా విస్తరించడం, భవిష్యత్తు పెట్టుబడులను ప్రకటించడం వంటి పరిణామాలతో 2019 ఆఖరు నాటికి రూ. 10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. అనంతరం 2021 కల్లా రూ. 15 లక్షల కోట్లకు, ఇప్పుడు రెండేళ్లు కూడా గడవకముందే రూ. 20 లక్షల కోట్లను దాటింది. అంతేకాకుండా గత నెలలోనే రిలయన్స్ సంస్థ రూ. 19 లక్షల కోట్లకు చేరింది. ఆ తర్వాత రెండు వారాల్లోనే మరో రూ. లక్షల కోట్లను సాధించడం గమనార్హం. ఇక, రిలయన్స్ తర్వాత రూ. 15 లక్షల కోట్లతో ఐటీ సేవల దిగ్గజం ఐటీసీ ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 10.5 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 7 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 7 లక్షల కోట్ల)తో అధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీలుగా ఉన్నాయి. 


Similar News