రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపేసిన జియో
ఎక్కువ మంది సబ్‌స్క్రిబర్లు ఇష్టపడే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఈ నెల 3వ తేదీ నుంచి టారిఫ్ పెంపును ప్రకటించిన సంగతి తెల్సిందే. దాంతో అధిక రేట్లు అమలుకు ముందే చాలామంది వినియోగదారులు ప్రస్తుత ధరల వద్దే ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటున్నారు. అయితే, జియో సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సబ్‌స్క్రిబర్లు ఇష్టపడే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అవి 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ. 395, 336 రోజుల గడువుతో లభించే రూ. 1,559 ప్లాన్‌లు కావడం గమనార్హం. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అపరిమిత 5జీ డేటాతో ఎక్కువ మందిని ఆకర్షించాయి. జియో నిర్ణయంతో టారిఫ్ పెంపు కారణంగా వీటిని రీఛార్జ్ చేయాలని భావించిన కస్టమర్లకు ఇవి అందుబాటులో లేవు. ఈ రెండు ప్లాన్‌లు తక్కువ ఆర్పు(వినియోగదారు నుచి సగటు ఆదాయం) కలిగి ఉండటమే తొలగింపునకు కారణం కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అఫర్డబుల్ ప్లాన్స్ జాబితాలో రూ. 155 ప్లాన్ మాత్రమే ఉంది. ఇటీవల పెంపు నిర్ణయంలో భాగంగా ఈ ప్లాన్ ధర 22 శాతం పెరగడంతో రూ. 189కి చేరనుంది. అయితే, జూలై 3లోపు రీఛార్జ్ చేసుకునే వారికోసం ఈ ప్లాన్ ఇప్పుడు అందుబాటులోనే ఉంది. ఇది 28 రోజుల వ్యాలిడితో లభిస్తుంది. అయితే, ఇతర డేటా ప్లాన్‌ల తరహాలో అపరిమిత 5జీ నెట్‌వర్క్ ఉండదు. ఇటీవల దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు తమ ఆర్పును మెరుగుపరిచేందుకు, కొత్త 5జీ సేవలు, మౌలిక సదుపాయాల కోసం టారిఫ్ ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.