టైమ్ ప్రపంచ అత్యంత ప్రభావశీల కంపెనీల జాబితాలో రిలయన్స్, టాటా
ఈ జాబితాలోని 'టైటాన్స్' విభాగంలో రిలయన్స్, టాటా గ్రూప్ సంస్థలు స్థానం పొందాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద గ్రూప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ 2024కు సంబంధించి 100 ప్రపంచ అత్యంత ప్రభావశీల కంపెనీల జాబితాలో మరోసారి చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలోని 'టైటాన్స్' విభాగంలో రిలయన్స్, టాటా గ్రూప్ సంస్థలు స్థానం పొందాయి. అయితే, 2021 ఏడాదికి గానూ జియో ప్లాట్‌ఫామ్ ఈ జాబితాలో స్థానం సంపాదించడంతో రిలయన్స్ ఈ జాబితాలో నిలవడం ఇది రెండోసారి. రిలయన్స్‌ను 'భారత అత్యంత శక్తివంతమైన సంస్థగా' అభివర్ణించిన టైమ్.. 58 ఏళ్లలో టెక్స్‌టైల్స్, పాలిస్టర్ వ్యాపారం నుంచి 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అతిపెద్ద గ్రూప్ సంస్థగా ఎదగడాన్ని టైమ్ ప్రస్తావించింది. ఇక, టైమ్ 2024 జాబితాలో టైటాన్స్ విభాగంలో రిలయన్స్, టాటా గ్రూప్ స్థానం దక్కించుకోగా, పయనీర్స్ విభాగంలో ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థానం సాధించింది. టైమ్ 100 కంపెనీల పూర్తి జాబితా జూన్ రెండోవారంలో విడుదల కానుంది.