రికార్డు స్థాయిలో ఈవీ అమ్మకాలు

ఫేమ్2 సబ్సిడీ పథకం గడువు ముగిసేలోపు కొనాలనే డిమాండ్ నేపథ్యంలో మార్చిలో 1,97,000 యూనిట్లతో సరికొత్త రికార్డు నమోదైంది

Update: 2024-04-03 07:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి అత్యంత వేగంగా కొనసాగుతోంది. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈవీ పరిశ్రమ రికార్డు స్థాయి విక్రయాలను సాధించింది. ఈ సంవత్సరంలో మొత్తం 16.6 లక్షల ఈవీలు అమ్ముడవగా, గతేడాదితో పోలిస్తే 41 శాతం పెరగడం గమనార్హం. ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం తెచ్చిన ఫేమ్2 సబ్సిడీ పథకం గడువు ముగిసేలోపు కొనాలనే డిమాండ్ నేపథ్యంలో మార్చిలో ఏకంగా 1,97,000 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు నమోదైంది. తాజాగా, ప్రభుత్వం ఈ ఏడాది జూలై చివరి వరకు ఈవీ టూ-వీలర్, త్రీ-వీలర్ల కొనుగోలు కోసం రూ. 500 కోట్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు దేశంలో మొత్తం 16,65,270 ఈవీలను ప్రజలు కొనుగోలు చేశారు. అంటే సగటున రోజుకు 4,562 ఈవీలు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 3,242 ఈవీలు విక్రయించబడ్డాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు అధికంగా ఉండటంతో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ విక్రయాలు ప్రతిబింబిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఈవీ అమ్మకాల్లో ఈవీ టూ-వీలర్లు 56 శాతం వాటాను కలిగి ఉన్నాయి. త్రీ-వీలర్ విభాగం 38 శాతం అమ్మకాలు సాధించాయి. ఎలక్ట్రిక్ కార్లు 89 శాతం పెరిగి 90,033 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

Tags:    

Similar News