ద్రవ్యోల్బణ కట్టడికి వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లు పెంపు: నిపుణులు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సెప్టెంబర్ 28-30వ తేదీల మధ్య జరగనుంది.
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సెప్టెంబర్ 28-30వ తేదీల మధ్య జరగనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ నాలుగోసారి కీలక వడ్డీ రేట్లను పెంచనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి వడ్డీ రేట్లను 140 బేసిస్ పాయింట్లు పెంచి 5.4 శాతానికి చేర్చింది.
ఈ క్రమంలోనే అమెరికా ఫెడ్ వరుస వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడం, ఇతర అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఆర్‌బీఐ రానున సమావేశంలో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును మూడేళ్లలోనే గరిష్ఠంగా 5.9 శాతానికి పెంచవచ్చని నిపుణులు అంచనా వేశారు.మే నెలలో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ 40 బేసిస్ పాయింట్లను, ఆ తర్వాత జూన్, ఆగష్టులలో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవల వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి పైగా నమోదైంది.
దీన్ని పరిగణలోకి తీసుకుని ఆర్‌బీఐ తన ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. గతవారం ఫెడ్ పెంపు నిర్ణయం తర్వాత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు యూకే, ఈయూ సెంట్రల్ బ్యాంకులు రెట్ల పెంపునకు మొగ్గు చూపాయి. దేశీయంగా కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో, 7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ ఇప్పట్లో తగ్గే అవకాశం లేనందున రెపో రేటును పెంచవచ్చని ఆయన వివరించారు.