ఆర్‌బీఐ కీలక రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం!
వినియోగదారుల ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటం, గ్లోబల్ స్థాయిలో కఠిన పాలసీ నిర్ణయాల నేపథ్యంలో ఆర్‌బీఐ మరోసారి కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముంబై: వినియోగదారుల ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటం, గ్లోబల్ స్థాయిలో కఠిన పాలసీ నిర్ణయాల నేపథ్యంలో ఆర్‌బీఐ మరోసారి కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యం 6 శాతం కంటే ఎక్కువ ఉండటంతో ఆర్‌బీఐ ఈ అంశానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఏప్రిల్ 3-6 తేదీల మధ్య జరగబోయే ఎంపీసీ సమావేశం వివరాలను చివరి రోజు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. అంతేకాకుండా ఇటీవల యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచాయి. దీన్ని కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తూనే ఎంపీసీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. కాగా, 2022, మే నుంచి ఆర్‌బీఐ అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుస సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను పెంచింది. దాంతో కీలక రెపో రేటు ప్రస్తుతానికి 6.50 శాతానికి చేరింది.